విద్యార్థుల‌తో కాంగ్రెస్ రాజ‌కీయ డ్రామా: ఎమ్మెల్యే ఏలేటి

క‌లం, నిర్మ‌ల్‌: నీట్ పేపర్ లీకేజ్ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ విద్యార్థులతో రాజకీయ డ్రామాలు ఆడుతోందని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (MLA Alleti Maheshwar Reddy) విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని గుర్తు చేశారు. “దేశం ఫస్ట్.. పార్టీ నెక్స్ట్” అనే సిద్ధాంతంతో బీజేపీ పనిచేస్తుందని పేర్కొన్నారు.

కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయ క్రీడలు ఆడుతున్నాయని ఆరోపించారు. ఢిల్లీలో విద్యార్థులను రెచ్చగొట్టి రాజకీయ నాటకాలు ఆడుతున్నారని, ఎన్నికల్లో గెలిచే సామర్థ్యం లేకపోవడంతో రాహుల్ గాంధీ నీట్ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో 72 సార్లు ప్రశ్నపత్రాలు లీక్ అయినప్పుడు అప్పటి ప్రధానమంత్రి లేదా కేంద్ర మంత్రులు రాజీనామా చేశారా అని ప్రశ్నించారు. అలాగే ఆప్ ప్రభుత్వంలో కూడా పలుమార్లు పేపర్ లీక్ ఘటనలు జరిగాయని గుర్తు చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. గతంలో సోనియా గాంధీపై విమర్శలు చేసిన ఆయన ఇప్పుడు పదవి కోసం అదే కుటుంబాన్ని ప్రశంసించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఉద్యోగాలు కోరితే వారిపై ఉక్కుపాదం మోపుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో 15 సార్లు పేపర్ లీక్ జరిగి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన విషయాన్ని కేటీఆర్ మరిచిపోయారా అని ప్రశ్నించారు. గతంలో లీకులకు కారణమైన వారే ఇప్పుడు నీతులు చెప్పడం ఆశ్చర్యకరమని అన్నారు.

దేశాన్ని అస్థిరపరిచేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. గత 12 ఏళ్లుగా అవినీతి మచ్చ లేకుండా పాలన అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీపై కుట్రలు చేస్తున్నారని అన్నారు. నీట్ పేపర్ లీకేజ్ అంశంపై పార్లమెంట్‌లో చర్చకు రావాల్సిందిపోయి, ఢిల్లీ వీధుల్లో యువతను రెచ్చగొడుతూ అసాంఘిక కార్యక్రమాలకు రాహుల్ గాంధీ ప్రోత్సాహం ఇస్తున్నారని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం యువత బలికావద్దని దేశ యువతకు ఆయన పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>