గోదావరి పుష్కరాల సక్సెస్‌కు పటిష్ట కార్యాచరణతో సాగాలి: సీపీ సాయి చైతన్య

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) పోలీస్ కమీషనరేట్ పరిధిలో జరగనున్న గోదావరి పుష్కరాలు – 2027 ఏర్పాట్లపై సీపీ సాయి చైతన్య బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పుష్కర ఘాట్ల వద్ద చేపట్టాల్సిన భద్రతా చర్యలు , ట్రాఫిక్ నిర్వహణ , పార్కింగ్ ఏర్పాట్లు , సీసీ కెమెరాల ఏర్పాటు , ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలు , అత్యవసర సేవల పై అధికారులకు సీపీ దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ.. గోదావరి పుష్కరాలు – 2027 అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆధ్యాత్మిక మహోత్సవమని , లక్షలాది మంది భక్తులు కమిషనరేట్ పరిధిలోని పుష్కర ఘాట్లకు తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రతి అంశాన్ని ముందస్తుగా ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తుల భద్రతకు ఎలాంటి లోటు లేకుండా ప్రతి ఘాట్‌కు ప్రత్యేక బందోబస్తు ప్రణాళిక రూపొందించి , రద్దీని దృష్టిలో ఉంచుకుని తగిన సంఖ్యలో పోలీసు అధికారులు సిబ్బందిని నియమించాలని సూచించారు. పుష్కర ఘాట్ల వద్ద భక్తుల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ప్రవేశ , నిష్క్రమణ మార్గాలను ఏర్పాటు చేయడంతో పాటు , క్యూ లైన్లు , బ్యారికేడ్లు , హెచ్చరిక బోర్డులు , దిశా నిర్దేశక సూచికలను ఏర్పాటు చేయాలని తెలిపారు.

వృద్ధులు, మహిళలు, చిన్నారులు , దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. వాహనాల రద్దీని నియంత్రించేందుకు ఘాట్లకు దూరంగా తగిన పార్కింగ్ స్థలాలను గుర్తించి , అక్కడి నుంచి షటిల్ వాహనాల ద్వారా భక్తులను ఘాట్లకు తరలించే విధంగా కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. ట్రాఫిక్ మళ్లింపు ప్రణాళికను ముందుగానే సిద్ధం చేసి , ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులు , సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు డిసీపీ ( అడ్మిన్ ) ఎన్. శుభం ప్రకాష్ , నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ ఏసీపీ లు ప్రకాష్ యాదవ్ , వెంకటేశ్వర్ రెడ్డి , శ్రీనివాస్ , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ లు శ్రీధర్ రెడ్డి , శ్రీ మలేష్ , గోదావరి పరివాహక ప్రాంతంలోని సి.ఐ లు , ఎస్.ఐ లు , ఐ.టి కోర్ , కమ్యూనికేషన్సి  సిబ్బంది , పోలీస్ కార్యాలయం సూపరింటెండెంట్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>