కలం, స్పోర్ట్స్ : ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ (FIFA Final) ముగిసిన వెంటనే మైదానం రణరంగంగా మారింది. స్పెయిన్ చేతిలో అర్జెంటీనా ఓడిపోయిన తీవ్ర నిరాశలో, ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ హైడ్రామాలో అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ లియాండ్రో పరేడెస్ ఏకంగా రెడ్ కార్డ్ తిని బయటకు వెళ్లాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ అంతటా స్పెయిన్ జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. సెకండ్ హాఫ్ ఇంజ్యూరీ టైమ్‌లో అర్జెంటీనా ప్లేయర్ ఎంజో ఫెర్నాండెజ్ రెడ్ కార్డ్ లైన్ దాటడంతో ఆ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఆ తర్వాత ఎక్స్ట్రా టైమ్ 106వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ ఫెర్రాన్ టోరెస్ అద్భుత గోల్ కొట్టారు. దీంతో స్పెయిన్ 1-0 తేడాతో అర్జెంటీనాపై ఘన విజయం సాధించి, రెండోసారి వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడింది. అయితే అసలు రచ్చ మ్యాచ్ ముగిసిన విజిల్‌తోనే మొదలైంది. స్పెయిన్ కెప్టెన్ రోద్రి విజయోత్సవాల్లో మునిగి ఉండగా, అర్జెంటీనా డిఫెండర్ నహుయెల్ మోలినా ఆయనపైకి పంచ్ విసిరారు. దీన్ని తట్టుకోలేని రోద్రి వెంటనే మోలినాను నిలదీశారు. తన కెప్టెన్‌కు అండగా స్పెయిన్ స్టార్స్ ఎరిక్ గార్సియా, బోర్జా ఇగ్లేసియాస్ కూడా రంగంలోకి దిగడంతో ఉద్రిక్తత పీక్కు చేరింది.
ఈ క్రమంలో అర్జెంటీనా ఆటగాడు పరేడెస్ ఒక్కసారిగా రెచ్చిపోయారు. ఎరిక్ గార్సియాను కాలితో తన్నుతూ, గొంతు పట్టుకుని నెట్టేశారు. అంతటితో ఆగకుండా స్పెయిన్ మిడ్‌ఫీల్డర్ గావిని బలంగా కిందకు తోసేశారు. అర్జెంటీనా మేనేజర్ లియోనెల్ స్కలోని ఎంత ఆపాలని చూసినా ఈ ఘర్షణ ఆగలేదు. ఈ హింసాత్మక ప్రవర్తనకు గానూ పరేడెస్‌కు అంపైర్ రెడ్ కార్డ్ ఇచ్చారు. ఈ గొడవకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

