కలం, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరవాసుల సొంతింటి కల నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. నగరంలోని క్యూర్ పరిధిలో తొలిదశలో ఇందిరమ్మ ఎల్ఐజీ ఇళ్ల (Indiramma LIG Housing) నిర్మాణాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivasa Reddy) నేడు ప్రారంభించి, ఇళ్ల నమూనాను ఆవిష్కరించారు. సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు హాజరయ్యారు. పట్టణ ప్రాంతంలోని పేదల కోసం ప్రభుత్వం ఈ కొత్త గృహ పథకాన్ని తీసుకొచ్చింది.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. జూలై 21 తేదీ నుంచి ఆగస్ట్ 10వ తేదీ వరకు మూడు వారాల పాటు అర్హులు ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. మీసేవ, వాట్సాప్, వెబ్సైట్ మూడింటిలో ఏ వేదిక నుంచైనా దరఖాస్తులు అందజేయాలని సూచించారు. ఏ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు ఆ నియోజకవర్గంలోనే అప్లై చేసుకోవాలన్నారు. ప్రస్తుతం ఎంపిక చేసిన 16 నియోజకవర్గాలతో పాటు రానున్న రోజుల్లో క్యూర్ ఏరియాలోని మిగతా నియోజకవర్గాల్లో భూములను గుర్తించి ఇళ్లకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు.

7,680 కుటుంబాలకు ఇంటి వసతి
‘అర్బన్ ఇందిరమ్మ ఇండ్లు’ (ఎల్ఐజీ) గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అమలుకానున్నది. మొత్తం 7,680 కుటుంబాలకు ఇంటి వసతి కల్పించేలా ప్రాథమిక ప్రణాళిక సిద్ధమైంది. సుమారు 528 చ.అ విస్తీర్ణంలో 400 చ.అ ప్లింత్ ఏరియాలో నిర్మిస్తున్న ఈ ఇండ్లకు సుమారు రూ. 11 లక్షల ఖర్చు కానున్నట్లు ప్రాథమిక అంచనా. ఇందులో రూ. 6 లక్షలు లబ్దిదారులు భరించాలి. మిగిలిదాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో మూడు విడతల్లో చెల్లిస్తుంది. మొత్తం ఇండ్లలో ఎస్సీలకు 14%, ఎస్టీలకు 5%, బీసీలకు 16%, దివ్యాంగులకు 5% చొప్పున రిజర్వేషన్‌ను హౌజింగ్ బోర్డు ఖరారు చేసింది. ఔట్సోర్సింగ్, క్లాస్-4 ఉద్యోగులు, పారిశుద్య సిబ్బందికి 10% రిజర్వేషన్ ఫిక్స్ చేసింది. మిగలిన 50% జనరల్ కోటాగా ఉంటుంది. రిజర్వు చేసిన 50%లో మహిళలకు 30% లభించేలా ఫార్ములా రూపొందింది.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి? :
అర్బన్ ఇందిరమ్మ ఇండ్లు కావాలనుకునేవారు ‘మీ సేవ’ ద్వారా రూ. 100 అప్లికేషన్ ఫీజును చెల్లించాలి. దీనితో పాటు డిపాజిట్‌గా మరో రూ. 10 వేలు చెల్లించాలి. పూర్తిగా లాటరీ పద్ధతిలో లబ్ధిదారుల ఎంపిక జరగనుంది. ఒకవేళ ఇల్లు మంజూరు కాకపోతే ఆ పది వేల రూపాయలను హౌజింగ్ బోర్డు తిరిగి చెల్లిస్తుంది. పూర్తిగా ఆన్లైన్ (యూపీఐ, నెట్‌బ్యాంకింగ్) ద్వారానే చెల్లింపు ఉండాలి. మొత్తం ఆరు దశల్లో ఈ అప్లికేషన్ స్క్రూటినీ జరుగుతుంది. తొలుత అప్లికేషన్ పెట్టుకోవడం, ఆ తర్వాత లబ్దిదారుల కేటగిరీ (ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు..)ని ధృవీకరణ, అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించడం ఉంటుంది. వార్షికాదాయం, గతంలో ఇండ్లు తీసుకున్నారా, ఇప్పటికే సొంతిల్లు ఉన్నదా.. ఇలాంటివి మూడవ దశలో చెకింగ్ ఉంటుంది. లబ్దిదారులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం నాల్గవ దశ. ప్రొవిజనల్ అలాట్మెంట్, ఫీల్డ్ వెరిఫికేషన్, పనుల పురోగతి ఐదో దశగా ఉంటుంది. ఇంటి నిర్మాణం మొత్తం పూర్తయిన తర్వాత అగ్రిమెంట్, లబ్ధిదారుల పేరు మీద రిజిస్ట్రేషన్, ఇంటిని అప్పగించడం చివరి దశగా ఉంటుంది.
లబ్ధిదారులకు ఉండాల్సిన అర్హతలేంటి? :
• తప్పనిసరిగా గత పదేండ్ల నుంచి హైదరాబాద్ (క్యూర్) పరిధి నివాసులై ఉండాలి.
• దరఖాస్తుదారులకు ఓఆర్ఆర్, క్యూర్ పరిధిలో ఇప్పటికే సొంతిల్లు, ఫ్లాట్, ప్లాట్ ఉండకూడదు.
• ఒక కుటుంబానికి ఒకే దరఖాస్తు, ఒకే ఇందిరమ్మ ఇల్లు పొందే అర్హత ఉంటుంది.
• గత ప్రభుత్వాల్లో ఇందిరమ్మ ఇల్లు లేదా మరో స్కీమ్ కింద ఇల్లు తీసుకోకుంటేనే అర్హులు.
• తప్పుడు వివరాలు ఇచ్చి ఇల్లు పొందితే ఆ తర్వాత వాపస్ ఇవ్వాల్సి ఉంటుంది.
• కచ్చితంగా క్యూర్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గానికి చెందినవారై ఉండాలి.
• ఇల్లు తీసుకున్న తర్వాత పదేండ్ల పాటు లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. ఈ పదేండ్లలో విక్రయించడం లేదా మరొకరి పేరు మీద రిజిస్ట్రేషన్ కుదరదు. అద్దెకు ఇవ్వడమూ నిషేధం. కానీ ఈ ఇంటిని కుదువ పెట్టి బ్యాంకు నుంచి రుణాలు తీసుకోడానికి వెసులుబాటు ఉంటుంది.
• అర్బన్ ఇందిరమ్మ ఇండ్ల కాలనీల్లో కారు పార్కింగ్ ఉండదు. బైక్‌లకు పార్కింగ్ సౌకర్యం ఉంటుంది.
• ఇంటికి అవసరమైన సొంత ఖర్చు, ప్రభుత్వ సబ్సిడీ లావాదేవీలన్నీ పూర్తయిన తర్వాత ‘అన్ డివైడెడ్ షేర్’ కేటాయింపు, పత్రాలు అందుతాయి.
• దరఖాస్తు చేసుకున్నంతమాత్రానే ఇల్లు పొందే అర్హత లభించినట్లు కాదు.
• ఈ కుటుంబాలకు సొంత స్థలం లేకపోయినా అర్హతలు ఉంటే ఇల్లు మంజూరవుతుంది.

ఎక్కడెక్కడ ఇండ్ల నిర్మాణం? :
రాజేంద్రనగర్ నియోజకవర్గం (మైలార్‌దేవ్‌పల్లి) – 480 ఫ్లాట్స్
మహేశ్వరం (జల్పల్లి) – 480
శేరిలింగంపల్లి (రాయదుర్గం) – 480
ఇబ్రహీంపట్నం (బండ్లగూడ ఎల్ఐజీ కాలనీ) – 480
మల్కిజిగిరి – కౌకూరు – 480
నాంపల్లి (రెడ్‌హిల్స్ జలమండలి పక్కన) – 360, నీలోఫర్ ఆస్పత్రి సమీపంలో – 120
ఖైరతాబాద్ (హకీంపేట్ దర్గా) – 120, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీ – 360
కార్వాన్ (కుల్సుంపుర) – 480
బహదూర్‌పుర (నంది ముసలిగూడ) – 480
అంబర్పేట్ (సిటీ పోలీస్ లైన్స్) – 480
కూకట్పల్లి (కేపీహెచ్‌బీ కాలనీ) – 480
మేడ్చల్ (పోచారం ఎల్ఐజీ కాలనీ) – 480
కుత్బుల్లాపూర్ (గాజులరామారం) – 480
సనత్‌నగర్ (పాటిగడ్డ) – 480
కంటోన్మెంట్ (మారేడ్‌పల్లి మహేంద్ర హిల్స్) – 480
మలక్‌పేట్ (గడ్డి అన్నారం ఆర్ అండ్ బీ క్వార్టర్స్) – 480
పూర్తి వివరాలకు సంబంధించిన PDF కోసం కింద ఉన్న ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Read Also: తిట్లు, ఓట్లు రేవంత్‌రెడ్డికి తెలిసింది ఇదే.. కేటీఆర్ ఫైర్
Follow Us On: Sharechat


