కలం, వెబ్ డెస్క్ : గుంటూరులో ఓ మహిళపై (Guntur Woman) దాడికి పాల్పడిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ మంత్రి ‘నారా లోకేశ్'(Nara Lokesh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి, ఆవేదనకు గురిచేసిందని పేర్కొంటూ.. రాజకీయ సంబంధాలు లేదా పార్టీ అనుబంధం తమను కాపాడుతాయని ఎవరైనా భావిస్తే అది పొరపాటేనని స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన లోకేశ్.. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (Chandrababu) వెంటనే కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఘటనపై ఇప్పటికే క్రిమినల్ కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అలాగే, ఈ ఘటనలో ప్రమేయం ఉన్న టీడీపీ కార్యకర్తను పార్టీలోని అన్ని పదవుల నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని తాను ఆదేశించినట్లు చెప్పారు.
“మహిళను అవమానించడం అంటే మన విలువలను అవమానించినట్టే. ఇలాంటి ఘటనల విషయంలో ఎలాంటి రాజీ ఉండదు. ఎవరైనా సరే, చట్టం తన పని తాను చేస్తుంది. పూర్తి స్థాయిలో చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సిందే” అని లోకేశ్ హెచ్చరించారు. మహిళలపై దాడులు, వేధింపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అనుసరిస్తోందని, రాజకీయ అనుబంధాలు ఎవరినీ చట్టం నుంచి తప్పించలేవని ఆయన స్పష్టం చేశారు.

