కలం, కరీంనగర్ బ్యూరో : ప్రభుత్వ ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్, పింఛన్ సేవల్లో (Pension Services) నాణ్యత, వేగవంతం పెంచేందుకు ఈ సేవలను పూర్తిగా డిజిటలైజేషన్ చేసే దిశగా ముందుకు వెళ్తున్నామని తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చందా పండిత్ తెలిపారు. పింఛన్, జనరల్ ప్రవిడెంట్ ఫండ్ సేవల అదాలత్, అకౌంట్స్, ఆడిట్, పెన్షన్, జిపిఎఫ్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా స్థాయి వర్క్ షాప్ కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించారు.
తెలంగాణ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్, కలెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అదాలత్ కు విశేష స్పందన లభించింది. పింఛను, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ సొమ్ము జమ కావడంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగులు ఈ అదాలత్ లో తమ దరఖాస్తులను సమర్పించారు. కొన్ని సమస్యలను అక్కడే పరిష్కరించిన అధికారులు, మరిన్ని దరఖాస్తుల పరిష్కారానికి రిటైర్డ్ ఉద్యోగులకు, డిడిఓ లకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చందా పండిత్ మాట్లాడారు.
ప్రభుత్వ శాఖల్లోని డిడివోలు ఆడిట్ నియమ నిబంధనలపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. జిపిఎఫ్ పింఛన్ ప్రతిపాదనలు పంపినప్పుడు సమగ్రంగా పరిశీలించి, నియమ నిబంధనల ప్రకారం అన్ని పత్రాలు జత చేసి పంపాలని సూచించారు. రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఈ అంశాలపై అవగాహన కల్పించి ప్రతిపాదన తయారీలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకోవాలని అన్నారు.
తద్వారా ఉద్యోగులు ఉద్యోగ విరమణ చేసిన వెంటనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి వారి ఆర్థిక ప్రయోజనాలను సకాలంలో పొందుతారని తెలిపారు. రిటైర్మెంట్ తేదీ ముందుగానే తెలుస్తుంది కాబట్టి మూడు నెలల ముందే ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని సూచించారు. ఉద్యోగి, అధికారి, ఉన్నతాధికారి, ట్రెజరీ అధికారులు సమన్వయంతో ఈ ప్రతిపాదనలు పంపిస్తే విరమణ పొందిన వారికి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తవని చందా పండిత్ తెలిపారు.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పేరుకుపోయిన జిపిఎఫ్ పింఛను సమస్యల పరిష్కారం కోసం అన్ని జిల్లాల్లో అదాలత్ వర్క్ షాప్ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. అలాగే శాఖల వారీగా కూడా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరిస్తున్నామని, పోలీస్, అటవీ తదితర శాఖలో ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తయిందని అన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఆడిట్ అభ్యంతరాలు పింఛన్ జిపిఎఫ్ సమస్యలు ఈ అదాలత్ లో పరిష్కరిస్తున్నామని అన్నారు. ఇప్పటికే డిజిటలైజేషన్ సేవలు ప్రారంభించామని, ఆర్థిక వ్యవసాయ తదితర శాఖలు మోడల్ గా ఈ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.
భవిష్యత్తులో పూర్తి డిజిటలైజేషన్ దిశగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ దీర్ఘకాలికంగా పింఛను, జిపిఎఫ్ సమస్యలు పరిష్కారం కాక, అసలు సమస్య ఎక్కడ ఉందో తెలియక అనేకమంది రిటైర్డ్ ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ వేదిక వారి ఇబ్బందులను తొలగిస్తుందని తెలిపారు. ఆడిట్ అభ్యంతరాలు, అకౌంట్స్ సందేహాలు ఈ కార్యక్రమం ద్వారా డీడివోలు నివృత్తి చేసుకునే అవకాశం వచ్చిందని అన్నారు.
ఉద్యోగ విరమణ తర్వాత ప్రశాంతమైన జీవనం గడిపేందుకు పింఛన్ జిపిఎఫ్ ఎంతగానో ఉపయోగపడతాయని, అందువల్ల డి డి వో లు అప్రమత్తంగా ఉండి సరైన విధంగా ప్రతిపాదనలు పంపాలని చందా పండిత్ అన్నారు. విరమణ పొందిన వెంటనే వారికి సొమ్ము వచ్చేలా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ నరేష్ కుమార్, డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ అభయ్ అనిల్ సోనార్కర్, జిల్లా ట్రెజరీ అధికారి నాగరాజు, కలెక్టరేట్ ఏవో సుధాకర్, వివిధ శాఖల డిడివోలు, ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్లు, సబ్ ట్రెజరీ అధికారులు పాల్గొన్నారు.

