ఎల్ నినో ముప్పు.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఎల్ నినో (El Nino) ముప్పు తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రత్తమైంది. రాష్ట్ర ప్రణాళిక మండలి వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి అధ్యక్షతన వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ప్రస్తుత పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలు, పంటలు, పశువుల సంరక్షణలో జాగ్రత్తలు సూచిస్తూ నివేదిక అందించాలని ఆదేశించింది.

20 నుంచి ప్రత్యేక సమావేశాలు..

ఎల్ నినో ప్రభావంపై ఉమ్మడి జిల్లాల వారీగా చేపట్టాల్సిన చర్యలపై ఈ నెల 20వ తేదీ నుంచి మంత్రులు ప్రత్యేక సమావేశాలు పెట్టాలని కేబినెట్ నిర్ణయించింది. జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమావేశాలు నిర్వహించనున్నారు. అంతేగాకుండా, ప్రతి జిల్లాకు ఒక ఇన్‌ఛార్జి మంత్రి, సీనియర్ ఐఏఎస్ అధికారికి బాధ్యతలు అప్పగించబోతున్నారు.

కేంద్రానికి లేఖ..

ఎల్ నినో కారణంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కేంద్ర ప్రభుత్వానికి తెలపాలని కేబినెట్ నిర్ణయించింది. వ్యవసాయ రంగాలపై ప్రభావం, తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్న తీరు, క్షేత్ర స్థాయిలో ఉపాధి కూలీల అవస్థలపై లేఖ రాయాలని భావిస్తోంది. అంతేగాకుండా, కేంద్రం నుంచి ప్రత్యేక బృందాన్ని తెలంగాణకు పంపించి, అధ్యయనం చేయించాలని కోరనుంది.

కలెక్టర్లకు కీలక ఆదేశాలు..

రాష్ట్రంలో 40 శాతం లోటు వర్షపాతం ఉన్న నేపథ్యంలో అత్యంత కీలకమైన సాగు, తాగు నీరు, వ్యవసాయం, విద్యుత్తు సరఫరా వంటి అంశాలపై కార్యాచరణ సిద్దం చేయాలని కేబినెట్ ఆదేశించింది. రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రం కానున్న నేపథ్యంలో.. తాగునీటికి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు సూచించింది. ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్తు కోతలు ఉండొద్దని.. ప్రాజెక్టుల్లో నీటిని మొదట తాగు నీటి అవసరాలకే వాడాలని నిర్దేశించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>