స్కూల్‌కు కలెక్టర్ సడన్ విజిట్.. ముగ్గురు టీచర్లు అవుట్!

కలం, నాగర్ కర్నూల్ : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడంలో నిర్లక్ష్యాన్ని సహించబోమని, విద్యా ప్రమాణాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని నాగర్ కర్నూల్ కలెక్టర్ (Nagarkurnool Collector) హేమంత కేశవ్ పాటిల్ స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయుల బాధ్యత అత్యంత కీలకమని, విధుల పట్ల అలసత్వం ప్రదర్శించే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. శుక్రవారం కల్వకుర్తి పట్టణంలోని గాంధీనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు.

విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల హాజరు, తరగతుల నిర్వహణ, బోధన విధానం, విద్యార్థుల అభ్యాస స్థాయి, పాఠశాల నిర్వహణ వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా పాఠశాలలో మొత్తం ఐదుగురు ఉపాధ్యాయులు పనిచేస్తుండగా, ప్రధానోపాధ్యాయుడు శంకర్‌తో పాటు ఉపాధ్యాయులు లావణ్య, మానస విధులకు గైర్హాజరైనట్లు కలెక్టర్ గుర్తించారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా ముగ్గురు ఉపాధ్యాయులు ఒకేసారి విధులకు రాకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

పాఠశాలలో విధులకు హాజరైన ఉపాధ్యాయులు సరస్వతి, రజితలను కలెక్టర్ వివిధ అంశాలపై ప్రశ్నించారు. విద్యార్థుల హాజరు శాతం, ప్రతిరోజూ నిర్వహిస్తున్న తరగతులు, సబ్జెక్టుల బోధన, విద్యార్థుల అభ్యాస స్థాయి, మధ్యాహ్న భోజన పథకం అమలు, పాఠశాల నిర్వహణ తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మొత్తం 94 మంది విద్యార్థులు ఈ రోజు పాఠశాలకు హాజరైనట్లు తెలుసుకున్న కలెక్టర్, కేవలం ఇద్దరు ఉపాధ్యాయులతో అన్ని తరగతులను ఎలా నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు.

పాఠశాల నుండి జిల్లా విద్యాశాఖ అధికారి డీఈఓతో కలెక్టర్ ఫోన్‌లో మాట్లాడారు. అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన ప్రధానోపాధ్యాయుడు శంకర్‌తో పాటు ఉపాధ్యాయులు లావణ్య, మానసపై సస్పెన్షన్‌కు సిఫారసు చేస్తూ తగిన నివేదికలను తనకు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల విశ్వాసం రోజురోజుకు పెరుగుతోందని, అలాంటి సమయంలో ఉపాధ్యాయులు తమ బాధ్యతలను మరింత నిబద్ధతతో నిర్వర్తించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ వెంట కల్వకుర్తి తహసిల్దార్ ఇబ్రహీం వివిధ శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>