Mobile Popup Ad
Mobile Popup Ad

రాజ్‌నాథ్ సింగ్‌‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

కలం, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలోనే నేడు పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలవనున్నారు. ఇందులో భాగంగా కాసేపటి క్రితం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గాంధీ సరోవర్‌కు డిఫెన్స్ భూములు కేటాయించినందుకు రాజ్‌నాథ్ సింగ్‌ కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రక్షణ శాఖ భూములను త్వరగా బదలాయించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్ర‌భుత్వ అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టుల్లో ఒక‌టైన ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం భూ సేక‌ర‌ణ‌, యుటిలిటీస్ బ‌ద‌లాయింపు వంటి అంశాల్లో పూర్తి స‌హ‌కారం అందిస్తామ‌ని కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు. దేశ స‌మ‌గ్ర‌త‌, ర‌క్ష‌ణ‌కు సంబంధించిన అంశమైనందున రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున అన్ని విధాలా స‌హాయ‌స‌హ‌కారాలు అందిస్తుందని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ లో రానున్న భార‌తీయ వాయు సేన ఎయిర్‌పోర్ట్ ను భారీగా విస్తరిస్తున్న నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున అన్ని విధాలా స‌హ‌క‌రిస్తామ‌ని వెల్లడించారు.

అయితే భార‌త వాయుసేన టెర్మిన‌ల్‌తో పాటు ప్ర‌యాణికుల సౌక‌ర్యార్ధం నిర్మించ‌నున్న పౌర విమాన‌యాన శాఖ‌కు చెందిన టెర్మిన‌ల్ బిల్డింగ్‌తో పాటుగా కార్గో, ఎంఆర్‌వో (MRO), హ్యాంగ‌ర్ (HANGER) సౌక‌ర్యాల‌ను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేలా స‌హ‌క‌రించాల‌ని కోరారు. ఇటీవల పశ్చిమాసియాలో చోటుచేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో ప్ర‌పంచ ప్ర‌సిద్ధిగాంచిన ఎయిర్‌లైన్స్ త‌మ హ్యాంగ‌ర్స్‌ను ఏర్పాటు చేసుకోవ‌డానికి అత్యంత అనుకూల‌మైన ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను ఆ దిశ‌గా అభివృద్ధి చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా దేవ‌ర‌క‌ద్ర స‌మీపంలో డీఆర్‌డీవో/డీఆర్‌డీఎల్ ఎంచుకున్న ప్ర‌దేశంలో వారికి సంబంధించిన‌ కీల‌క‌మైన‌ ప్రాజెక్ట్‌ను త్వ‌ర‌గా మంజూరు చేయాల‌ని కోరారు.

డీటీవో వెంకన్న మృతిపై సీఎం దిగ్భ్రాంతి

మరోవైపు రాష్ట్రంలో భూపాలపల్లి డీటీవో వెంకన్న మృతిపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకన్న కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వం అదుకుంటుందని చెప్పారు. సంఘటన పైన సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ ను ఆదేశించారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>